* బాణాసంచా విక్రయ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
* పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు
UPDATED 21st OCTOBER 2019 MONDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం డివిజన్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఐదు బాణాసంచా తయారీ యూనిట్లను సీజ్ చేసినట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దాపురం డివిజన్ పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఐదు తయారీ యూనిట్లను సీజ్ చేయడం జరిగిందని, ఈ యూనిట్ల లైసెన్సులు రద్దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో గల 12 మండలాలు, మూడు మున్సిపాలిటీలలో సంబంధిత ఎస్సై, అగ్నిమాపక అధికారి, తహసీల్దార్ లు నిర్దేశించిన ప్రదేశాల్లో ఊరికి దూరంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆర్డీవో అనుమతి పొందినప్పటికీ 125 డెసిబల్స్ కు మించిన పేలుడు పదార్థాలు, టపాసులు, బాంబులు అమ్మరాదని తెలిపారు. టెంట్లు వేసి క్లాత్ లు కట్టి మంచాల మీద బాణాసంచా సామగ్రిని అమ్మరాదని, రేకులతో కూడిన షాపుల ఏర్పాటు విక్రయదారులదే బాధ్యతని తెలిపారు. షాపులన్నీ వరుస క్రమంలో లేకుండా షాపుల మధ్య మూడు మీటర్ల దూరం ఖచ్చితంగా పాటించాలని, అలాగే ప్రమాదాల నివారణకు అవసరమైన ఇసుక బకెట్లు, నీళ్లు, ఖాళీ డ్రమ్ములు ఏర్పాటు చేసుకునే బాధ్యత బాణాసంచా విక్రయ నిర్వహకులదేనని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, వారి అనుమతిని రద్దు చేసి సామాన్లు సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగను సంతోషంతో జరుపుకోవాలని కోరారు. బాణాసంచా విక్రయ కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందిన నిర్వాహకులకు ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ సూచించిన మార్గదర్శకాలను వివరించడం జరుగుతుందని ఆర్డీవో పేర్కొన్నారు.







