* ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.వి. నారాయణ
* ఆదిత్యలో ఘనంగా ప్రారంభమైన ఫార్మసీ జాతీయస్థాయి సదస్సు
UPDATED 23rd NOVEMBER 2018 FRIDAY 5:00 PM
గండేపల్లి: విజయానికి అడ్డదారులు ఉండవని, కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.వి. నారాయణ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫార్మసీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సహకారంతో మోడరన్ టెక్నాలజీస్ ఇన్ డ్రగ్ డిజైన్ డవలప్ మెంట్ అండ్ ఎవాల్యూయేషన్ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, అతిధులుగా క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్, విశిష్ట అతిధిగా ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.వి.నారాయణ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా సహాయంతో విద్యార్థులు నూతన అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, నేటి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ విభాగంలో వెనుకంజలో ఉన్నారని, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న నారాయణ, తాను కలిసి చదువుకున్నామని ఆయన ఆధ్వర్యంలో ఫార్మసీ రంగం అభివృద్ధి పథంలో పయనించాలని అన్నారు. ముఖ్య అతిధి డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని, ఫార్మసీ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న నేను ఫార్మసీ రంగం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు తరచూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులలో పాల్గోవడం ద్వారా యువ ఫార్మాసిస్టుల నూతన ఆలోచనలను పరస్పరం పంచుకొనే వీలు ఏర్పడి తద్వారా మంచి జ్ఞానం సంపాదించవచ్చని అన్నారు. ఫార్మసీ రంగ సంస్థలు అనేక సదస్సులు, క్విజ్ వంటి తదితర పోటీలను నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నాయని, వాటిలో పాల్గోవడం ద్వారా మంచి పరిజ్ఞానంతో పాటు వారు ఇచ్చే ధృవపత్రాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య యాజమాన్యం డాక్టర్ నారాయణను దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు నిర్వహిస్తున్న స్టాల్స్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదుకు చెందిన నైపర్ డీన్ & విభాగాధిపతి డాక్టర్ నళినీ శాస్త్రి, ఎన్ఐటి (వరంగల్) ప్రొఫెసర్ & విభాగాధిపతి డాక్టర్ పి. ఓంకార పెరుమాళ్, మైలాన్ ల్యాబ్ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ డి. రాఘవేంద్ర, సన్ ఫార్మా అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ ఎం. రాజ్ కుమార్ వంటి నిష్ణాతులైన న్యాయనిర్ణేతల పర్యవేక్షణలో విద్యార్థులు సమర్పించిన పేపర్ ప్రజంటేషన్స్ పరిశీలించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారని సురేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. దివాకర్, వై. సురేంద్రనాధ్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ డి. సతీష్, వివిధ జిల్లాల ఫార్మసీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







