UPDATED 29th NOVEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ ఎస్.వి. శ్రీధరరావు అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో సాస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు యాళ్ల పద్మలత అధ్యక్షతన మహిళా పరిరక్షణ పక్షోత్సవాలు సందర్భంగా మహిళా చట్టాలు, హక్కులపై అవగాహనా సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ శ్రీధరరావు మాట్లాడుతూ గృహహింసకు గురవుతున్న మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని, జిల్లాలోని మహిళలకు సరైన న్యాయం అందించడానికి ఒక మహిళా డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు ఎస్. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, చట్టాలపై సరైన అవగాహన లేక వారిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతీ మహిళా విద్యావంతురాలై మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిజిఎం కెవిఎస్ ప్రసాద్, కాకినాడ డీఎస్పీ విజయ్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ మణమ్మ, ఐసిడిఎస్ సిపిడివో పద్మావతి, శ్రీలత మహిళా ఎస్సై సుప్రియ, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.







