UPDATED 27th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: బలవంతపు పన్నుల వసూళ్ల విధానం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆవాల లక్ష్మీ నారాయణ, ఊబా జాన్ మోజస్ మున్సిపల్ సిబ్బంది వ్యవహారంపై మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో జీరోఅవర్ ను ప్రకటించగా మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు లేకపోవడంతో ప్రజా సమస్యలు వినేందుకు కమీషనర్ లేకపోతే ఎలా అని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఇంతలో చైర్ పర్సన్ కలుగజేసుకుని కమీషనర్ కోర్టుకు వెళ్లిన కారణంగా పదిహేను నిమిషాల్లో వస్తారని తెలిపారు. కమీషనర్ వచ్చిన తరువాత సమావేశం ప్రారంభమైంది. పట్టణంలో పన్నులు వసూలు చేసే విధానంలో సిబ్బంది తీరు బాగోలేదని, ప్రజలను అవమానించేలా వారి పనులు ఉంటున్నాయని ఆవాల లక్ష్మీనారాయణ, అలాగే ఆరవ వార్డు హౌసింగ్ బిల్లులు రావడం లేదని ఊబా జాన్ మోజస్ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అజెండాలోని అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, టిపివో రామ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







