* ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి
UPDATED 31st JANUARY 2020 FRIDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): విద్యార్థులు బాల్యం నుంచి సేవాభావం అలవర్చుకోవాలని పెద్దాపురం ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు స్థానిక మహారాణీ కళాశాలలో ప్రశంసా పత్రాలను శుక్రవారం ప్రధానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వీరయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావం కలిగి ఉండాలని, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఇతర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ప్రొగ్రాం మేనేజర్ బర్రే నాగేశ్వరావు మాట్లాడుతూ గతనెల 23వ తేదీన ప్రకృతి వైపరీత్యాలపై శిక్షణ పొందిన 73 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు ఎం. తాతాజీ, కె. నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.







