పారదర్శక పాలనకు వేదిక జన్మభూమి-మా ఊరు

UPDATED 4th JANUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందేలా చూడటమే జన్మభూమి- మా ఊరు కార్యక్రమ లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి అన్నారు. స్థానిక అయోధ్య రామపురం మునిసిపల్ ఉన్నత పాఠశాల, పల్లిపేట, సంత మార్కెట్ లలో నిర్వహించిన ఆరవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, పేదల కోసం ప్రవేశపెడుతున్న పథకాలపై అవగాహన కల్పించి అన్నివర్గాల ప్రజలు వాటిని వినియోగించుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని, ప్రతీ పేదవాడికి గృహం నిర్మించి ఇవ్వాలనే ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిష్కరించడం జరుగుతుందని, ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు, అలాగే అర్హులైన పేదవారికి పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను కూడా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా మానవహక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, పోలిపల్లి హైమావతి, ఐసిడిఎస్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us