UPDATED 14th JULY 2017 FRIDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 15 వ తేదీన ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని(వరల్డ్ యూత్ స్కిల్స్ డే ) పురస్కరించుకుని యువతకు పలు పోటీలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి కేంద్రం (APSSDC) సహకారంతో, ఆదిత్య గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో కళాశాలలో ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు యంగ్ ఇండియా-స్కిల్ ఇండియా అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ, పోస్టర్ ప్రెజెంటేషన్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ యువతలో నిమిడీకృతమైన నైపుణ్యాన్నిద్విగుణీకృతం చేయాలని, యువత యొక్క ప్రాధాన్యాన్ని పెంచి ప్రపంచ అభివృద్ధిలో వారి పాత్ర గురించి సరైన అవగాహన కల్పించడానికి ఐక్య రాజ్య సమితి జులై 15 ని "వరల్డ్ యూత్ స్కిల్ డే" గా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలోకళాశాల క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిరెడ్డి రమేష్, ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, పోలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సంకురాత్రి టి.వి.ఎస్.కుమార్, గ్రంధాలయ అధికారి కె. అశోక్ తదితరులు పాల్గొన్నారు.







