UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువప్రస్థానం సదస్సుల ద్వారా 19-25 సంవత్సరాల మధ్య వయస్సు యువతకు దిశానిర్దేశం చేసే ఉద్దేశ్యంతో ఒక వినూత్న కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సభలో ప్రముఖ టివి, సినీ నటులు, దర్శకులు, నిర్మాత, మోటివేటర్ కె.వి. ప్రదీప్, సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ సిఇవో ఏ.ఎస్. మూర్తి, ప్రముఖ పర్సనాలిటీ డెవలప్ మెంట్ తరగతుల నిర్వాహకులు ఆకెళ్ళ రాఘవేంద్ర, వక్తలు గంపా నాగేశ్వరావు, జయసింహ, సరస్వతి ప్రదీప్ పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రభుత్వం అభివృద్ది యువత చేతుల్లోనే ఉందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నూతంగా యువప్రస్థానం సదస్సుల ద్వారా భవిత వైపు సరైన దిశలో పయనించేందుకు వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులచే కార్యక్రమం రూపొందించడం జరిగిందని, ఈ కార్యక్రమం తమ సంస్థలో జరగడం ఆనందంగా ఉందని శేషారెడ్డి అన్నారు. ప్రదీప్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ జీవితంలో నేడు చదువు అంటే కట్ అండ్ పేస్ట్ లా మారిపోయిందని, కానీ విద్యార్థి తనలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి నూతన ఆలోచనలకు పదునుపెట్టాలని, నిరంతరం మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని తమకంటూ సరికొత్త మార్గాన్ని ఏర్పరుచుకోవాలని అన్నారు. ఏ.ఎస్. మూర్తి మాట్లాడుతూ విద్యార్థి ఇంటర్వ్యూలలో పరీక్షించే సమయంలో ప్రాజెక్టు సరైన అవగాహనతో విపులంగా వివరించగలుగుతున్నాడా, సమయపాలన, సబ్జెక్టుపై పట్టు తదితర ప్రాధాన్యతా క్రమాలలో పరీక్షించి ఎంపిక చేస్తారని, అయితే ప్రపంచంలో ఎక్కడున్నా ఆయా కంపెనీలలో పనిచేసే సామర్ధ్యం, వివిధ భాషలలో విశ్లేషించి చెప్పగలిగే నైపుణ్యం, ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని సాధించగలిగే నిరంతర నేర్చుకొనే తత్వం వాటిపైనే ఆయా కంపెనీలలో పనిచేసేకాలం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ మన సంతకం ఆటోగ్రాఫ్ అయ్యేలా చేసుకొనే సామర్థ్యం మీ చేతులలోనే ఉందని అయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







