UPDATED 9th DECEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: సమస్యల పరిష్కారంలో, మానవ హక్కుల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుంటామని జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అన్నారు. జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బ్రౌన్ పేట కార్యాలయంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం పదవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మానవహక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు జుత్తుక అప్పారావు, న్యాయవాది సుధీర్, కుంచే నానిబాబు, అళక్కి శ్రీనివాసరావు, రెహమాన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల ఆరోగ్యం, వారికి సర్టిఫికెట్లు మంజూరులో తమ సంఘం అండగా నిలిచిందని అన్నారు. పోస్టల్ సేవలు లావాదేవీలపై, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన దేశానికి చెందిన మహిళలను రక్షించడంలో, సామర్లకోటలో ఆధార్ కేంద్రం ఏర్పాటు తదితర విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడం జరిగిందని, అలాగే కాకినాడ నుంచి చెత్తను తీసుకువచ్చి సామర్లకోటలో వేసే ప్రక్రియను నిలుపుదల చేయడంలో, రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాట్లుపై పలు కార్యక్రమాలు నిర్వహించి పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఈ సమావేశంలో ఏకగ్రీవంగా పలు తీర్మానాలను చేశారు.







