UPDATED 14th DECEMBER 2017 THURSDAY 8:30 PM
పెద్దాపురం: జిల్లాలోని 30 వేల మంది రైతుల ప్రయోజనం దృష్ట్యా ఇకపై మొక్కజొన్నపిండితో సగ్గుబియ్యం తయారు చేస్తే అడ్డుకుంటామని జిల్లా దుంప రైతు సంఘం సగ్గుబియ్యం మిల్లర్లను హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జిల్లా దుంప రైతుల సంఘం గురువారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు పుట్టా సోమన్నచౌదరి మాట్లాడుతూ సగ్గుబియ్యం మిల్లులపై జిల్లా యంత్రాంగం దాడులు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇటీవల జిల్లాలో కొన్ని సగ్గుబియ్యం మిల్లులు కర్ర పెండలం దుంప పిండికి బదులు మొక్కజొన్న పిండి వాడటం వల్ల దుంపకు గిట్టుబాటు ధర లభించడంలేదని, ప్రతీ ఏటా సాగు విస్తీర్ణం పడిపోతోందన్నారు. ఉపాధ్యక్షుడు యెండ్రు సత్తిబాబు మాట్లాడుతూ మొక్కజొన్నతో చేసిన సగ్గుబియ్యం వల్ల వ్యాధులు వస్తాయని, ఈ కారణంగా మొక్కజొన్న వినియోగాన్ని అరికట్టాలన్నారు. ప్రధాన కార్యదర్శి రంధి సత్యనారాయణ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తరహాలో స్థానిక సగ్గుబియ్యం మిల్లుల్లో కూడా సిసి కెమెరాలు అమర్చాలని, దీనివల్ల అక్రమాలు జరగవన్నారు. రాష్ట్రానికే గర్వకారణమైన తూర్పుగోదావరి జిల్లా సగ్గుబియ్యం పరిశ్రమను పరిరక్షించుకోవాలని ఇందుకు అన్నివర్గాలు సహకరించాలన్నారు. సగ్గుబియ్యం మిల్లులకు మొక్కజొన్నను అక్రమంగా రవాణా చేసేవారిని పట్టుకుంటే రూ. ఐదువేలు రివార్డ్ ఇస్తామని కోశాధికారి గుణ్ణం వెంకట్రావు ప్రకటించారు.







