UPDATED 27th MAY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: సమాజంలో నెలకొన్న అసమానలు, సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలను రూపుమాపేందుకు అవిశ్రాంత కృషి చేసిన పోరాట యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయులని జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత, కందుకూరి స్మారక అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కందుకూరి శత వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం కందుకూరు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిరామకృష్ణ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తన యావదాస్తిని ధారాదత్తం చేసిన ఆదర్శమూర్తిగా, మూఢ విశ్వాసాలను అజ్ఞానాన్ని రూపుమాపడానికి వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన సంఘసంస్కర్త కందుకూరి అని కొనియాడారు. యుగాలు, తరాలు మారినా కందుకూరి ఆదర్శభావాలు ఎప్పటికీ ఆచరణీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, ఫిజికల్ డైరెక్టర్ తాళ్లూరి వైకుంఠం, ఏపీ రాజేంద్రకుమార్, కోడూరి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







