UPDATED 27th JANUARY 2018 SATURDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థలలో ఈ నెల 30వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ వ్యవస్థాపక సభ్యులు, జనరల్ సెక్రటరీ, తమ తల్లి లక్ష్మీరాజ్యం జన్మదినం (28 -1 -2018, ఆదివారం) పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 18 నుంచి 55 సంవత్సరాలు వయస్సు గల ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులందరు ప్రతీ మూడు నెలలకు రక్తదానం చేయవచ్చన్నారు. రక్తం అందక ప్రమాదాలలో గాయపడిన వారు ఎందరో మృత్యువాతకు గురవుతున్నారని, మనం ఒకసారి ఇచ్చిన రక్తంతో ముగ్గురు ప్రాణాలను రక్షించవచ్చని ఆయన అన్నారు. తమ సంస్థ ఉద్యోగులు, విద్యార్థుల సహకారంతో దశాబ్ధ కాలంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ జిల్లాలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ (కాకినాడ, రాజమహేంద్రవరం) తో పాటు రెడ్ క్రాస్, రోటరీ, ధన్వంతరి బ్లడ్ బ్యాంక్స్ వంటి సంస్థలకు మొత్తం 15వందలు యూనిట్లకు పైగా రక్తం సంవత్సరానికి రెండు పర్యాయాలు (జనవరి, ఆగష్టు) అందిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో ఉద్యొగులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, వైస్ ప్రిన్సిపాల్స్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.







