UPDATED 27th FEBRUARY 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలు ప్రజలు అందుబాటులో ఉండాలని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ అన్నారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా జీరో అవర్ లొ ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 19,20,23 వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాన్ని కొత్తూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలోకి మార్పు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 19,20 వార్డులకు చెందిన ఓటర్లకు పోలింగ్ కేంద్రం దూరంగా ఉంటుందని, దీంతో దివ్యాంగులైన ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ఓటర్లకు అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలా కాకుండా దూరంగా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని, అలా కాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ మూడు వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాలు గతంలో బసివిరెడ్డి సత్రంలో ఉండేవని, అయితే సత్రం శిథిలం కావడంతో పోలింగ్ కేంద్రాలను టిటిడి కళ్యాణ మండపంలోనికి మార్పు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తూరు పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఇబ్బందికి అవకాశం ఉండడంతో దీనిని దృష్టిలో ఉంచుకుని 20వ వార్డును మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న స్త్రీ శక్తి భవనంలోకి మార్పు చేస్తే ఓటర్లకు అందుబాటులో ఉంటుందని అధికార పార్టీ సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు పేర్కొన్నారు. 6వ వార్డు కౌన్సిలర్ ఊబా జాన్ మోజేష్ మాట్లాడుతూ దాతల సహాయంతో చేతిపంపు వేయించామని, అది మరమ్మతుకు గురైందని వేసవిని దృష్టిలో ఉంచుకుని వెంటనే చేతి పంపును మరమ్మతులు చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా డిఇ సిహెచ్ రామారావు మాట్లాడుతూ నీటి ఎద్దడి లేకుండా అదనపు మోటార్లను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ వార్డులోని పనులు మందకొడిగా సాగుతున్నాయని, కొన్ని పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని అన్నారు. మున్సిపల్ కమీషనర్ టి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు బిల్లులు చెల్లించామని, మిగిలిన బిల్లులు అనుమతి వచ్చిన వెంటనే చెల్లిస్తామని అన్నారు. పాత పనులు అన్ని పనులు పూర్తి చేయడానికి సహకరిస్తామని కొత్త పనులు ప్రారంభించడం జరగదని అన్నారు. మరో కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి వాహనాలు కొనుగోలు చేయడానికి అడ్వాన్సులు ఇస్తున్నారని, అయితే వాటిని రికవరీ ఎలా అని, అలాగే సిబ్బంది బదిలీపై వెళ్లిన సమయంలో వారి వద్ద నుంచి రికవరీ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కమీషనర్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ సిబ్బంది బదిలీ అయిన తరువాత ఆయా మున్సిపల్ కమీషనర్ కు సిబ్బంది నుంచి రావాల్సిన బకాయిలపై వివరణ ఇస్తామని, వారి జీతాల నుంచి మినహాయింపు జరుగుతుందని కౌన్సిల్ సభ్యులకు తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ప్రజా ప్రతినిధులు ఫెక్సీలను ఎవరికి వారే తొలగించాలని లేని పక్షంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తొలగిస్తామని దీనికి ప్రజాప్రతినిధులు ప్రతీ ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టి. నాగేంద్రకుమార్, డీఈ సిహెచ్ రామారావు, కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజేష్, మున్సిపల్ మేనేజర్ ఎస్. అచ్యుతరాజు, ఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లు, టీపిఓ రత్నాకర్, ఇతర మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







