UPDATED 29th MAY 2018 TUESDAY 9:30 PM
పెద్దాపురం: అధికారం ఇచ్చిన ప్రజలకు నాలుగు మంచి పనులు చేసి పేరుతెచ్చుకోవాల్సింది పోయి నాలుగేళ్లలో కలెక్షనే అజెండాగా పాలకులు పని చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ అన్నారు. స్థానిక సుధా కాలనీలో ఆయన స్వగృహంలో మంగళవారం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు మహానాడు పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని, మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటిని అరికట్టలేకపోతుందని విమర్శించారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు.. జాబు లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని అన్నారు. మహానాడుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని, అవినీతిపై నిలదీస్తే ప్రతిపక్షాలు అభివృద్దికి అడ్డు పడుతున్నాయంటూ ఎదురుదాడి చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కనీసం ఎలా అరికట్టాలనే అంశాన్ని కూడా మహానాడులో ప్రస్తావించకుండా, ప్రపంచంలో చంద్రబాబు అంతటి గొప్ప వ్యక్తి లేరని, లోకేష్ లాంటి వీరుడు మరొకరని చూడలేమనే రీతిలో నాయకులు పొగడ్తల వర్షం కురిపించారని, మద్దతు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదనే రీతిలో ప్రసంగాలు సాగాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం పెద్దఎత్తున సహాయ సహకారాలు అందించిందని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమో నవ నిర్మాణ దీక్షల పేరిట కేవలం బిజెపి పార్టీ మోసం చేసిందని తిట్టడం తప్ప సాధించేది ఏమీలేదని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, వైఎస్సార్ స్వర్ణయుగం రావడం ఖాయమని అన్నారు. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్ రైతులు, పేదలు పడుతున్న కష్టాలు, రాష్ట్ర సమస్యలను స్వయంగా తెలుసుకొని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటన్నింటిని నెరవేర్చారని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతన రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇస్తున్న హామీలు, వాగ్దానాలను జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా తప్పకుండా అమలు చేస్తారన్నారు. పెద్దాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు నాయకత్వంలో పార్టీ చాలా పటిష్టంగా ఉందని ఆయన అన్నారు.







