* ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ అదిత్య
UPDATED 12th JUNE 2020 FRIDAY 6:30 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కొత్తగా తీసుకొచ్చిన పంటల సాగు హక్కుదారులు చట్టం ప్రకారం రెవిన్యూ, వ్యవసాయాధికారులు పూర్తి సమన్వయంతో కౌలు రైతులకు పంటల సాగు హక్కు పత్రాలు జారీచేసి పంట రుణాల కల్పనకు తోడ్పాటును అందించాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ అదిత్య ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి ఏడు మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, రెవిన్యూ సిబ్బందితో దూరదృశ్య సమావేశం నిర్వహించి పంటల సాగు హక్కు పత్రాలు జారీ, అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, మూడవ విడత అమలు తీరు, 90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాలపై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగు హక్కు పత్రాలు జారీకి సంబంధించి అవగాహనా గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, అర్హత గల కౌలుదారు రైతాంగానికి పంటల సాగు హక్కు పత్రాలు అందించి రుణాలు కల్పనకు భరోసాను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అటవీ భూమిపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న గిరిజనులకు సాంప్రదాయ అటవీ నివాసితులకు పోడు భూముల పట్టాలు పొందే హక్కుల కల్పనకు మూడవ విడత ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. రైతు భరోసా లబ్దిను ఎక్కువ మంది పొందేలా 10 ఎకరాలు విస్తీర్ణం పైబడి భూముల యజమానుల భూములను వారి వారసులకు మ్యూటేషన్, పార్టీషన్, రిజిస్ట్రేషన్లు ద్వారా విభజించి ఆ పధకం లబ్దిని చేకూర్చాలని సూచించారు. షెడ్యూలు ప్రాంతాలలో ఒక గిరిజనుడు నుంచి మరో గిరిజనుడికి మాత్రమే భూ బదలాయింపులు ప్రాజెక్టు అధికారి అనుమతితో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. ఇంకా రైతు భరోసా నిధులు జమకాని వారి వివరాలు జమ కాకపోవడానికి గల కారణాలపై నివేదికలు రూపొందించి సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్యూరిఫికేషన్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని, వెబ్ ల్యాండ్ అప్ డేట్ చేయాలని ఆదేశించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 క్రింది తిరస్కరించిన 300 ధరఖాస్తులపై పునర్ విచారణకు గ్రామసభలు నిర్వహించాలని రెవిన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకురాలు ఎస్. శ్యామల, వ్యవసాయాధికారి లక్ష్మణ్, తహసీల్దార్లు కె. లక్ష్మీకళ్యాణి, డిప్యూటీ తహసీల్దార్ ఆర్. వెంకటేశ్వరరావు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.







