UPDATED 13th SEPTEMBER 2018 THURSDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అందంగా తీర్చిదిద్దిన మండపంలో, మిరుమిట్లు గొలిపే దీపకాంతులలో, మదినిండుగా భక్తిభావంతో సంప్రదాయం ఉట్టిపడే రీతిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అత్యంత ప్రీతిపాత్రమైన దైవం వినాయకుడని, ఆయను చూసినంతనే అఖండమైన జ్ఞానం లభిస్తుందని అన్నారు. విద్యార్థులంతా ఆ దేవదేవుని సద్గుణాలు, బుద్ధిబలం, ఏకాగ్రత, మనోనిశ్చలత, సహనం, విశ్వాసం, ప్రసన్నత, త్యాగ నిరతి అలవర్చుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







