UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు రికవరీ వేగవంతం చేసేందుకు మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని జెడ్ఎస్ మేనేజర్ శేషగిరి, డిఎంజి మేనేజర్ రాజకుమారి అన్నారు. స్థానిక టిటిడిసి ఆవరణలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నాగదుర్గ అధ్యక్షతన జిల్లా సమాఖ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి.ఆర్.డి.ఎ పధకాలు అమలుచేస్తున్న సమాఖ్యలు వార్షిక అకౌంట్స్ పూర్తిచేయడంలో పారదర్శకంగా ఉండాలని, వార్షిక ఆడిట్ కి సమాఖ్యలు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. పసుపు, కుంకుమల పేరిట సమాఖ్య సభ్యులకు ఒక్కొక్కరికి రూ. రెండు వేలు చొప్పున ఆయా బ్యాంకు ఖాతాల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైనందున సంబంధిత బ్యాంకులను సంప్రదించాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులు భవాని, జ్యోతి, ఆరోగ్యమిత్రలు, తదితరులు పాల్గొన్నారు.







