సేంద్రీయ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి

* దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
* ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్
* పెద్దాపురం రుచీ సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో పామాయిల్ రైతులతో సమావేశం

UPDATED 9th JANUARY 2020 THURSDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రకృతిలో లభించే వనరులతో మాత్రమే వ్యవసాయం చేస్తూ మానవాళి ఆకలి తీర్చడమే లక్ష్యంగా మానవుడు చేపట్టిన వ్యవసాయమే సేంద్రీయ వ్యవసాయమని, సేంద్రీయ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని సుప్రసిద్ద యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. పెద్దాపురం-సామర్లకోట ఏడిబి రహదారిలో గల రుచీ సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ టేకోవర్ చేసిన నేపథ్యంలో గురువారం ఇక్కడికి వచ్చిన ఆయనకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం బాబా రాందేవ్ మాట్లాడారు. మనదేశంలో ఎంతోమంది ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారికి తన వంతు సహకారంగా ఏదో చేయాలన్న తపనే తనను యోగా వైపు తన దృష్టి మరల్చిందని అన్నారు. నిత్యం యోగా సాధనతో జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. నేడు అనేక మార్పులు చెందుతూ ప్రకృతి విరుద్దంగా రసాయన ఎరువులు ఉపయోగిస్తూ పండించే పంటల వలన ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, ఈ పరిస్థితిని అధిగమించడానికి పూర్వపు సేంద్రీయ వ్యవసాయాన్ని ఆచరించాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. సేంద్రీయ జీవన ఎరువుల వినియోగం పెరగడం వల్ల మొక్కలకు అవసరమైన ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలు తగు మోతాదుల్లో లభ్యమై నేల ఉద్పాదకత, భూసారం నిలకడగా ఉండి పంటల నాణ్యత వృద్ధి  చెందుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తాము ఉత్పత్తి చేస్తున్న పతంజలి ఉత్పత్తులకు ఎంతో మంచి ఆదరణ లభించిందని, ఆ స్ఫూర్తితో మరిన్ని సేంద్రీయ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే దిశగా తమ సంస్థ అడుగులు వేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా పెద్దాపురం పట్టణంలో రుచీ సోయా ఇండస్ట్రీస్ ను టేకోవర్ చేయడం జరిగిందని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి సీఈవోలు సత్యేంద్ర అగర్వాల్, సంజయ్ గిరి బన్సాలీ, బిజినెస్ హెడ్ పి. మల్లేశం, డిప్యూటీ జనరల్ మేనేజర్ పట్టాభి రామిరెడ్డి, అసోసియేట్ జనరల్ మేనేజర్ టివి రమణ, హెచ్ఆర్ హెడ్ ఎం. రామకృష్ణ, పామాయిల్ రైతుల సంఘం అధ్యక్షుడు రామారెడ్డి, కార్యదర్శి బుజ్జి, హెచ్ఆర్ మేనేజర్ రామకృష్ణ, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 
 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us