UPDATED 28th MARCH 2018 WEDNESDAY 10:00 PM
పెద్దాపురం: నాణ్యమైన విద్య, ఉత్తమ క్రమశిక్షణ నవోదయ విద్యాలయాలు అందిస్తాయని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయ 31వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు చక్కటి విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారన్నారు. నవోదయ విద్యాలయాల్లో ఉండే విద్య, క్రీడామైదానాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో మరే కార్పొరేట్, ప్రభుత్వ విద్యాలయాల్లో ఉండదన్నారు. ఏ విద్యార్థి అయినా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలరని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ తాను కడపలో నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని, అక్కడ వారు అందించిన నాణ్యమైన విద్య వల్ల నేడు ఈ స్థితికి వచ్చినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. మునిరామయ్య, తదితరులు పాల్గొన్నారు.







