UPDATED 27th JUNE 2018 WEDNESDAY 9:00 PM
రాజానగరం: గైట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై బుధవారం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వల్లీమాధవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పారా సైకాలజిస్ట్, ప్రఖ్యాత శిక్షకుడు డాక్టర్ జగన్నాధరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితలక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం సాంకేతికయుగం నడుస్తుందని, భవిష్యత్తులో విద్యార్థులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని, వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులు శ్రద్ధ వహించాలన్నారు. ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా నైపుణ్యాలు దాగివుంటాయని వాటికి పదును పెట్టాలన్నారు. ప్రిన్సిపాల్ వల్లీమాధవి మాలాడుతూ వ్యక్తిత్వ వికాస అభివృద్ధి అనే అంశంపై డిగ్రీ కళాశాల విద్యార్థులకు రెండు రోజులపాటు శిక్షణా తరగతులు జరుగుతాయని వీటిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







