UPDATED 19th MARCH 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద గల బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చీమలకొండ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణులను అభివృద్ధి చేసేందుకు బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి సహించలేక కొంతమంది విమర్శలు చేయడం వారి కుటిల స్వభావానికి నిదర్శనమని అన్నారు. బ్రాహ్మణుల ఆశీర్వాదం పూర్తిస్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వానికి అందించాలని మంత్రి కోరారు. అనంతరం బ్రాహ్మణ సంఘం నాయకులు మంత్రిని దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చీమలకొండ ప్రసాద్, ఉపాధ్యక్షులు రామకృష్ణ శ్రీవత్స, కార్యదర్శి అళక్కి కృష్ణశాస్త్రి, జాయింట్ సెక్రటరీ సన్నిధిరాజు సుబ్బన్న, వేమూరి సోమేశ్వర శర్మ, డి. సూర్యనారాయణ, సన్నిధిరాజు వెంకన్న, టిడిపి నాయకులు ముత్యాల రాజబ్బాయి, తోట సుబ్బారావునాయుడు, తదితరులు పాల్గొన్నారు.







