UPDATED 3rd JANUARY 2020 FRIDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తొలి భారతీయ ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే త్యాగపూరిత జీవితానికి ప్రతీకగా నిలుస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కొనియాడారు. ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో సావిత్రీబాయి పూలే 189వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ కుమార్ తొలుత సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారని, మహిళా ఉపాధ్యాయులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గొప్ప వ్యక్తులను గుర్తు చేసుకోవడం ద్వారా గొప్ప ఆలోచనలను వ్యాప్తి చేసిన వాళ్లమవుతామని, నిమ్న వర్గాలకు ఆనాడే విద్యను అందించిన విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎ. అమలావతి, కె. వరలక్ష్మి, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి టి. నాగమణి, అంగన్వాడీ అధ్యక్షురాలు వి. వెంకటలక్ష్మి, బాలం లక్ష్మి, ధనలక్ష్మి, రమణమ్మ, దుర్గ, సీఐటీయూ ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







