UPDATED 14th APRIL 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక బలుసులపేటలో మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ను కేవలం దళిత ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారని, అగ్రవర్ణాల ప్రాంతాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ముద్రగడ పద్మనాభం ఇప్పటికే కాపులు నివాసం ఉండే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ మేరకు పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అంబేడ్కర్ ఆశయాల అమలుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. జనసేన నియోజకవర్గ నాయకుడు తుమ్మల రామస్వామి నాయుడు(బాబు) మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు నివాసం ఉండే ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఎస్. దయాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారానే ఆనేక మంది ఉన్నతస్థాయిలో ఉన్నారని, అయితే ఆ ఫలాలు అందరికి పూర్తి స్థాయిలో అందేవిధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. అనంతరం నాయకులు కేక్ కట్ చేసి పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు ఊబా జాన్ మోజస్, పితాని సూర్యనారాయణ, రావి కస్తూరి, మాల మహానాడు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







