ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలి

UPDATED 25th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఎంపిడివో కర్రి స్వప్న పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ సిహెచ్ జగ్గారావు అధ్యక్షతన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో స్వప్న మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులతో కూడిన ఫోటోలు, ఇతర చిత్రపటాలను వెంటనే తొలగించాలని, రాజకీయ పార్టీల నాయకులు నిర్వహించే సభలు, సమావేశాలకు అధికారులు హాజరుకాకూడదని అన్నారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, హోర్డింగులను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రకటన జారీ అయిన నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందన్నారు. నియమావళి అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవిధమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఓటర్లను ప్రభావితం చేసే ఏ విధమైన ప్రకటనలు జారీ కాకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us