* మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు
UPDATED 30th JANUARY 2020 THURSDAY 6:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): అహింస, ప్రేమ, శాంతి తత్వాలను బోధించిన గాంధీ మార్గం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘంటించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ మహాత్ముడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన శాంతి మార్గంలో ప్రతీ ఒక్కరూ పయనించాలని అన్నారు. శాంతి, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అన్న గాంధీజీ మాటలను నిజం చేసేందుకు సామాజికంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ రామారావు, టిపిఎస్ మంజుల, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







