ఎన్నికల సమావేశానికి గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తప్పవు

UPDATED 14th FEBRUARY 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం: ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి జరిగే ప్రతీ సమావేశానికి ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని, హాజరుకాని సిబ్బందిపై చర్యలు తప్పవని ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఇవిఎం-వివి ప్యాట్లతో ఓటుహక్కు వినియోగం అంశంపై పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఆయన గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామంలోని ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో 10 శాతం మంది ఓటర్లకు ఇవిఎంల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించే ముందురోజు మైక్ లో ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ ఓటరుకు ఇవిఎం పనితీరు గురించి పూర్తిగా వివరించాలని, నమూనా ఓటు వేసిన ప్రతీ ఒక్కరి సంతకాన్ని సేకరించాలన్నారు. ఈ నమూనా పోలింగును చిత్రీకరించి పోలింగు పూర్తయిన రోజు సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత సిబ్బందికి అందచేయాలన్నారు. ఈ ట్రైనింగు నిమిత్తం ఇచ్చిన ఇ.వి.ఎంలను జాగ్రత్తగా భద్రపరచాలని అన్నారు. ప్రతీ  పోలింగ్ స్టేషన్లో త్రాగునీరు, టాయిలెట్లు, కరెంటు, ర్యాంపులు తప్పనిసరిగా ఉండాలని, వాటిని పరిశీలించి నివేదికను అధికారులకు పంపాలన్నారు. ఈ సమావేశం అనంతరం ఇవిఎం ప్రధాన భాగాలైన బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్, కంట్రోల్ యూనిట్ల పనితీరు, అలాగే ఇవిఎంలకు అమర్చవలసిన బ్యాటరీ, కేబుల్, పోలింగ్ స్లిప్ తదితర అంశాలపై వివరించారు. ఈ శిక్షణలో భాగంగా మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం మాస్టర్ ట్రైనీలు ఇవిఎంలపై దిగువస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట, పెద్దాపురం తహసీల్దార్లు, అసిస్టెంట్ రిటర్నింగు ఆఫీసర్లు సిహెచ్ నరసింహరావు, కె. గోపాలకృష్ణ, సామర్లకోట ఎంపిడివో కె. స్వప్న, టిడిపి పట్టణ అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ టి.ఏ. కృష్ణారావు, ఎలక్షన్ డిటి శ్రీనివాసరావు, రెవిన్యూ ఇనస్పెక్టర్ రవితేజ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us