UPDATED 11th MAY 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: నా లక్ష్య సాధనలో ఆదిత్య ప్రోత్సాహం మరువలేనిదని దర్శకుడు సుకుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ తో ఆత్మీయ కలయిక కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సుకుమార్, ముఖ్య అతిథిగా మాజీ ఉపాధ్యాయుడు ఎం.ఎల్.సి సుబ్బారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, సినీ నిర్మాత వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్, సుకుమార్ మిత్రుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ, ఆదిత్య కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఎన్. విశాలాక్షి, ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, టి.వి.ఎస్. కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ అవగాహన, ఆకలింపు, ఆచరణ=సుకుమార్ అని, కాకినాడలో ట్యూటర్ గా పనిచేసిన ఆయన సినీ దర్శకుడు కావాలనే లక్ష్యంతో సినీరంగానికి వెళ్లారని, అప్పటి అతని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దని వారించినా వెళ్లారన్నారు. అయితే సంవత్సరం తర్వాత భీమవరం కళాశాలలో అధ్యాపకుడిగా చేరారని అన్నారు. తొమ్మిది నెలల తర్వాత మరలా సినీరంగంలో చేరి ఆర్య చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించి రంగస్థలం వరకు సాగించిన ప్రయాణం అందరికీ తెలిసిందేనని అన్నారు. సుకుమార్ నిరంతర కృషి, పట్టుదల, తపన మనందరికీ ఆదర్శమని అన్నారు. ఎం.ఎల్.సి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కోరేవారు గతాన్ని ఎన్నటికీ మరువరాదని, తన ప్రయాణంలో ఆదిత్య యొక్క సహకారం మరువలేనిదని చెప్పిన సుకుమార్ ఎంతో సంస్కారవంతుడు కనుకే ఈ రోజు ఇంతటి స్థాయికి చేరుకున్నారని అన్నారు. వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ సుకుమార్ తన గురువని, ఆయన వద్ద ఇంటర్ చదువుకున్నానని, ఎంత చనువుగా ఉన్నా సరే గురువు అనే గౌరవంతో అయన వద్ద ఎక్కువ స్వేచ్ఛ తీసుకోలేనని అన్నారు. సాయి రామకృష్ణ మాట్లాడుతూ ఆదిత్య కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడినేనని, 35 సంవత్సరాల క్రితం అన్నా అని పిలిచే సుకుమార్ ఇప్పటికీ అన్నా అనే పిలవడం నిజంగా అయన ఎంత ఎదిగినా తన గతాన్ని మరువలేదని, తను మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ నేను ఆదిత్య కుటుంబ సభ్యుడిని కాకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని, శేషారెడ్డిగారి ప్రోత్సాహంతోనే దైర్యంగా సినీ రంగంలో అడుగుపెట్టానని అన్నారు. కాకినాడలో మూడువేల రూపాయలకు పనిచేసిన నేను నా మొదటిజీతంతో ఇంటి వద్ద బాత్ రూమ్ కట్టించానని, సినీరంగంలో అడుగుపెట్టాలనే కోరికను శేషారెడ్డి గారికి చెప్పగా వద్దని వారించారని, అయితే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి అభ్యర్ధనతో సమ్మతించిన అయన ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకు వెళ్లానన్నారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి భీమవరం కళాశాలలో అధ్యాపకుడిగా చేరానని, మలి ప్రయత్నంలో ఆర్యతో మీ ఆశీస్సులు పొందానని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య సిబ్బందితో ముఖాముఖి మాట్లాడుతూ మనిషికి ఫిట్ నెస్ ఎంతో ముఖ్యమని, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయని అన్నారు. దర్శకుడిగా ప్రేక్షకుల హృదయాలు గెలవడం కంటే అధ్యాపకుడిగా విద్యార్థుల హృదయాలు గెలవడంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని అన్నారు. గెలుపు ఎప్పుడూ ఫ్లాష్ బ్యాక్ లాంటిదని, ఓటమి మనల్ని వెన్నంటే ఉంటూ గెలుపుకు నాంది పలుకుతుందని అన్నారు. తన తర్వాత చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని, ప్రాణం ఉన్నంతవరకూ దర్శకుడిగా మంచి చిత్రాలు అందించాలన్నదే తన కోరిక అని అన్నారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం సుకుమార్ ను ఘనంగా సత్కరించారు.







