UPDATED 7th NOVEMBER 2022 MONDAY 7:10 AM
▪️ రైస్ మిల్లులకు వచ్చే వాహనాలకు ఆశీల వసూళ్లకు నో
▪️ మిల్లర్లతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కు..?
▪️ హైకోర్టులో కేసు ఉందంటూ దాటవేత
▪️ మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అధికారులు
▪️ నెలవారీ ముడుపులు అందుతున్నట్లు సమాచారం
▪️ ఆరు సంవత్సరాలుగా పట్టించుకోకపోవడంపై అనుమానాలు
Peddapuram Muncipality : పెద్దాపురం మున్సిపాలిటీలో ఆశీల వసూళ్లలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మున్సిపల్ అధికారుల నిర్వాకం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కంచే చేను మేస్తే అన్న చందంగా తయారయ్యింది అధికారుల తీరు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులను పెంచాల్సింది పోయి అధికారులే ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించడం చూస్తుంటే వారి తీరుపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇప్పటికీ కూడా ఆశీల వసూళ్ల విషయంలో మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మార్కెట్ ప్రదేశాల్లో పట్టిక బోర్డులు ఏర్పాటుచేయాలని కమీషనర్ కు చెప్పినా కూడా ఇప్పటికీ కూడా పట్టించుకోలేదు. దీంతో ఆశీల కాంట్రాక్టర్ వసూళ్ల విషయంలో తగ్గేదేలే అంటూ వసూళ్లను షరా మామూలుగానే వసూలు చేసేస్తున్నాడు.
మిల్లర్లతో అధికారులు కుమ్మక్కు...?
పట్టణ పరిధిలో ప్రధానంగా ప్రముఖ రైస్ మిల్లులు ఉన్నాయి. ఈరైస్ మిల్లులకు రోజూ వందల సంఖ్యలో వాహనాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లారీలు వస్తుంటాయి. అయితే వాటికి మాత్రం ఆశీలు ఎంతమాత్రం వసూలు చేయద్దంటూ మున్సిపల్ అధికారులు సదరు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆశీల వసూళ్లకు సంబంధించిన విషయం హైకోర్టులో ఉంది, ఆశీలు వసూలు చేయడానికి వీల్లేదు అని అధికారులు మిల్లర్లకు లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారు.
దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అలాగే ఆశీలు పాడుకునే కాంట్రాక్టర్ హెచ్చు రేటుకు పాడకుండా తక్కువ రేటుకు పాట పాడి ఆశీలు కాంట్రాక్ట్ దక్కించుకుంటున్నాడు. నిజానికి హైకోర్టు ఈవిషయంలో అశీలు వసూలు చేయమని కానీ.. చేయద్దు అని కానీ ఎటువంటి అదేశాలు జారీ చేయలేదు. మిల్లర్లు మాత్రం హైకోర్టులో కేసును వేసి తమ రైస్ మిల్లులకు వచ్చే వాహనాలకు మాత్రం ఆశీలు చెల్లించకుండా తప్పించుకుంటున్నా అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
దీంతో మున్సిపాలిటీకి రూ. లక్షల్లో ఆదాయం గండి పడుతోంది. మిల్లర్ల నుంచి నెలవారీగా కొంతమంది మున్సిపల్ అధికారులకు లబ్ది చేకూరుతున్నట్లు సమాచారం. ఈవిషయంలో మరింత లోతైన విచారణ చేసి మున్సిపాలిటీకి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.







