UPDATED 12th OCTOBER 2022 WEDNESDAY 03:20 PM
Leopard Cub : ముంబైలోని ఫిలింసిటీలో నాలుగు వారాల వయసున్న చిరుత పిల్ల కనిపించింది. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ, చిరుత పిల్ల ఫిలింసిటీ పరిధిలోని, ఆరే కాలనీ సమీపంలో కనిపించింది. ఒంటరిగా వెళ్తున్న చిరుత పిల్లను అక్కడి వీధి కుక్కలు వెంటాడాయి.
కుక్కలు తరమడంతో పరుగెడుతున్న చిరుత పిల్లను స్థానిక సెక్యూరిటీ గార్డులు, స్థానికులు గుర్తించారు. వెంటనే చిరుతను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత పిల్లను స్థానిక సంజయ్ గాంధీ నేషనల్ పార్కు అధికారులకు అప్పగించారు. వారు చిరుత పిల్లను తీసుకెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే చిరుత పిల్లను తన తల్లి దగ్గరకు చేరుస్తామని అధికారులు అన్నారు. ప్రస్తుతం అధికారులు చిరుతను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు.







