* కలుషిత ఆహారం తినడంతో వాంతులు, విరోచనాలు
* పెద్దాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
UPDATED 5th AUGUST 2019 MONDAY 10:00 PM
పెద్దాపురం: పెద్దాపురం డివిజన్ పరిధిలోని గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో సోమవారం కలుషితమైన ఆహారం తిన్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడడంతో వెంటనే స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. కలుషితమైన ఆహారం తీసుకున్న వారిలో ఎక్కువ మంది ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. బాధితుల్లో విశాల్ (ఇచ్చాపురం), వినయ్ కుమార్ (అనకాపల్లి), సునీల్ (గాజువాక), బాబీ (యానాం), నాని (అమలాపురం), ధీరజ్ (అమలాపురం)తో పాటు ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు. భాదితులకు ఆసుపత్రికి చెందిన వైద్యులు చికిత్స అందించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై దొరబాబు ఆరా
కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఆయన సూచించారు.



