UPDATED 25th SEPTEMBER 2019 WEDNESDAY 6:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ నెల 9వ తేదీ వరకు నిర్వహించనున్న 60వ వార్షిక శరన్నవరాత్రి ఉత్సవాలకు బుధవారం ఉదయం 10-08 నిమిషాలకు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ ఆధ్వర్యంలో పందిరి రాటముహుర్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ మాట్లాడుతూ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే దేవీ నవరాత్రి ఉత్సవాలను ఈనెల 29 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధం మాట్లాడుతూ ఈనెల 29వ తేదీ ఉదయం 9-40 నిమిషాలకు కలశ స్థాపన, ప్రతీ రోజు ఉదయం 5-15 నిమిషాలకు సుప్రభాతసేవ, 9 గంటల నుంచి 11-30 నిమిషాల వరకు ఏకవార రుద్రాభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయన్నారు. సాయంత్రం 3 గంటలకు లలితా సహస్ర నామ పారాయణాలు, 5-30 నిమిషాల నుంచి కుంకుమ పూజలు, 6-30 నిమిషాలకు నిత్య కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పం, రాత్రి 8-30 నిమిషాలకు వివిధ భజన సంఘాలచే నామ సంకీర్తనలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం మూడు గంటలకు స్వామి స్వసంవేద్యానంద మహారాజ్, శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమం (విశాఖపట్నం) వారి ధార్మిక ఉపన్యాసం, 5వ తేదీ ఉదయం 7 గంటలకు సరస్వతీదేవికి విద్యార్థులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 6వ తేదీ దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 5 గంటలకు సామూహిక అష్టలక్ష్మీ పూజలు, 9వ తేదీ పూర్ణాహుతి, అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పెంటపాటి మల్లిఖార్జునరావు, నువ్వుల బాబ్జి, తేలుగుంట్ల నరసింహారావు, మండవిల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







