* భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలు
* తరించిన భక్తజనం
UPDATED 10th MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక కంచి మహా సంస్థానం ప్రసన్నఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష తమలపాకుల పూజతో పాటు స్వామివారికి విశేషరీతిలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ హనుమంతునికి సంకల్ప పూజలు చేపట్టారు. గోక్షీరం, చందనం, పంచామృతం, నారికేళ జలంతో విశేషరీతిలో అభిషేకాలు జరిపారు. అనంతరం చందనంతో పాటు వివిధ రకాల పూజాద్రవ్యాలతో పవనసుతునికి విశేష అలంకరణలు చేపట్టారు. వడమాలలు వేసి పూజాది కార్యక్రమాలు జరిపారు. భక్తుల రామనామ కీర్తనలతో ఆలయంలో సందడి నెలకొంది. ఈ పూజాది కార్యక్రమాల్లో ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, కంచి మహా సంస్థానం చైర్మన్ చంద్రాభట్ల గణపతిశాస్త్రి, లలితా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్స్ మట్టే సత్య ప్రసాద్, మట్టే శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు, పండితులు భమిడిపాటి వాసు, తదితరులు పాల్గొన్నారు.







