UPDATED 25th JUNE 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రంలోని బిసి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బిసిలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని, చట్టసభల్లో బిసిల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తేనే బిసిల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీలు ఆమోదించి కేంద్రానికి పంపినా సరే నేటివరకు ఆ బిల్లు చట్టరూపం దాల్చలేదని, ముఖ్యమంత్రి కేంద్రప్రభుత్వంతో తక్షణం చర్చలు జరిపి బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో అత్యంత వెనుకబడిన బిసి కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని, నేటికి కూడా ఆ హామీని అమలు చేయలేదని, ఓసిలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతీ సంవత్సరం వేట విరామ సమయంలో ఇచ్చే భృతి ఈ సంవత్సరం నేటివరకు ఇవ్వలేదన్నారు. అలాగే సముద్రజలాలు కలుషితం కాకుండా కాపాడాలని, యాబ్భై సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ పింఛను మంజూరు చేయాలని, గృహనిర్మాణాల్లో మత్స్యకారులకు ప్రతీ గృహానికి రూ.30 వేలు అదనంగా ఇస్తామన్నారని, కానీ నేటికి కూడా అది అమలుకాలేదన్నారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు కోస్టుగార్డులుగా, తీరప్రాంత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని, మత్స్యకారుల పిల్లలకు కోసం కార్పొరేట్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మత్య్ససంపదను నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డంగులు నిర్మించాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బిసి సైన్యంతో న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిల్లా సత్యన్నారాయణ, తణుకు శ్రీనివాస్ యాదవ్, జానా వెంకట్, ఎం. అప్పలరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.







