UPDATED 28th FEBRUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: విద్యార్థులు సాధారణ చదువుతోపాటు సైన్స్ ప్రయోగాలపై దృష్టి సారించి సృజనాత్మకత పెంచుకోవాలని హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. గురువారం స్థానిక అయోధ్య రామపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్, సైన్స్ కోసం ప్రజలు అనే విషయం విద్యార్థులంతా తెలుసుకోవాలని అన్నారు. సైన్స్ ద్వారా ప్రపంచంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని, వినూత్న ఆలోచనలతో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు రూపొందించాలని పేర్కొన్నారు. పాఠశాల సైన్స్ క్లబ్ తరఫున సైన్స్ ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, కె. శ్రీనివాస్ ల పర్యవేక్షణలో సైన్స్ రంగవల్లుల పోటీలు, క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాల పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీలను శాస్త్రవేత్తల పేర్లతో టీములుగా ఏర్పరచి విద్యార్థులను ఆలోచింపచేసే ప్రశ్నలతో చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఈజీ క్లీనింగ్ మిషన్, హైడ్రాలిక్ లిఫ్ట్ చాక్లెట్, ఏటీఎంలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు హెచ్ఎం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడి తాళ్లూరి వైకుంఠం, మొహమ్మద్ షఫీ, జి. గోవిందు, కె. అరుణ, కెవివి సత్యనారాయణ, ఏ.ఎల్.వి. కుమారి, శ్రీనివాస్, వల్లి, తదితరులు పాల్గొన్నారు.







