భీమేశ్వరుని సన్నిధిలో ఉపముఖ్యమంత్రి పూజలు

UPDATED 22nd NOVEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చిన రాజప్ప, కుమారుడు రంగనాగ్ తో కలిసి లక్ష బిల్వార్చన, గోపూజ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప విలేఖరులతో మాట్లాడుతూ హిందువులకు కార్తీకమాసం అతి పవిత్రమైనదని, ఈ మాసమంతా ఉపవాసాలతో, దైవభక్తితో శివకేశవులను ఆరాధిస్తామని అన్నారు. కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గతంలో ఈ ఆలయానికి సరైన వసతులు, రవాణా సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడేవారని, గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ ఆలయానికి అనేక సౌకర్యాలను కల్పించామని తెలిపారు. కాలిబాట వంతెన, స్నానాల ఘట్టం, గదులు, విశ్రాంతి భవనం, జల్లు స్నానం, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు ఏర్పాటు చేశామని, అలాగే పవిత్ర పుష్కరిణి కూడా అభివృద్ధి చేశామని చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని ఆయన కోరారు. దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాలతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి దేవస్థానం నిధులు రూ.ఐదు లక్షలతో నిర్మించతలపెట్టిన ప్రహరీగోడకు మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్(రాజమండ్రి) డి.ఎల్.వి. రమేష్, తహసీల్దార్ ఎల్. శివకుమార్, బిక్కిన రాజశేఖర్, వల్లూరి శ్రీనివాస్, శ్రీపాద రాజశేఖర ఘనాపాటి, ప్రధాన పండితులు వేమూరి సోమేశ్వర శర్మ, కె. జోగారావు, సిహెచ్ భీమేశ్వరశర్మ, సీహెచ్ రాంబాబు, సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us