UPDATED 25th SEPTEMBER 2019 WEDNESDAY 5:30 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): సమయ పాలనే విద్యార్థి అభివృద్ధికి తొలిమెట్టు అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షత జరిగిన సభకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి (రాజమహేంద్రవరం) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సమయ పాలన పాటించాలని, ఇరవై సంవత్సరాల క్రితం తాను తొలి పి.హెచ్.డి పట్టా అందుకున్నానని, నేటికీ జ్ఞాన తృష్ణ తీరలేదని అన్నారు. 2018 విద్యా సంవత్సరంలో ఆదిత్య సంస్థ ద్వారా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎం.ఎల్.ఐ.ఎస్.సి పూర్తి చేశానని, నేను కూడా ఆదిత్య విద్యార్థినేనని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఒక లక్ష్యం కలిగి దానిని సాధించే వరకు కృషి చేయాలని సూచించారు. ఫార్మసీ రంగం ఎంతో పవిత్రమైనదని ఈ మార్గాన్ని ఎంచుకున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఒక డిగ్రీ పూర్తి చేయడానికే కష్టపడుతున్న నేటి విద్యార్థులు డాక్టర్ రామారెడ్డి వంటి వారిని ఆదర్శంగా తీసుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం కళాశాల నివేదికను డాక్టర్ కె. రవిశంకర్ వివరించారు. ఫార్మసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలు ఒక్కొక్కరికి రూ.200/- విలువైన జనరల్ మెడిసిన్, ఐరన్ సిరప్, కిట్, మెరిట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందచేశారు. అనంతరం డాక్టర్ రామారెడ్డిని ఆదిత్య యాజమాన్యం తరుపున దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. రవిశంకర్, డాక్టర్ వి. రవిశంకర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







