UPDATED 22nd JULY 3022 FRIDAY 09:30 PM
Lip Lock Challenge : కర్నాటకలో కాలేజీ విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వ్యవహారం దుమారం రేపుతోంది. విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చక్కగా కాలేజీకి వెళ్లి బుద్దిగా చదువుకోవాల్సి పిల్లలు.. ఇలా పెడదోవ పట్టడం షాక్ కి గురి చేసింది. విద్యార్థుల ముద్దుల పోటీ దుమారం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఖాకీలు.. ఆ ఘటనకు పాల్పడిన 8మంది విద్యార్థులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.
మంగళూరులోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఓ ప్రైవేటు అపార్ట్ మెంటులో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంగా ‘ట్రూత్ ఆర్ డేర్’ (Truth or Dare) పోటీలో భాగంగా లిప్‌లాక్ ఛాలెంజ్ (Lip-Lock Challenge) నిర్వహించారు. ఇందులో భాగంగా యూనిఫాంలో ఉన్న ఒక విద్యార్థి మరో విద్యార్థినిని ముద్దు పెడుతుండగా.. తోటి విద్యార్థులు కేరింతలు కొడుతూ వీడియో తీశారు. ఆ తర్వాత ఆ బృందంలోని ఓ 17ఏళ్ల విద్యార్థి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ వీడియోను ఇటీవల పోస్టు చేయడంతో బాధిత అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది.
దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వీడియోను చూపించి ఆ బృందంలోని ఇద్దరు విద్యార్థినులపై తోటి విద్యార్థులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులపై పోక్సో (POCSO) చట్టంతోపాటు ఐపీసీ, ఐటీ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు అనంతరం వారిని జువనైల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు.







