UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ తరుపున పాల్గొనే ఫుట్ బాల్ టీంకు ఎంపికైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. పాండిచ్చేరిలో డిసెంబర్ నెల 3 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఫుట్ బాల్ పోటీలలో జెఎన్టీయుకె తరుపున పాల్గొనే 20 మంది క్రీడాకారుల్లో ఎనిమిది మంది తమ సంస్థకు చెందిన విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్. హరికృష్ణ, జిబిల్ బేబీ, ఎం.ఎ. జేబిన్, ఫార్మసీ కళాశాలల నుంచి అలీ నిహాల్, మార్క్ రీనాల్డీ, లోకో అడేయి తేయఫ్ల్యూస్, పాల్ ఎజికె, కె. అరవింద్ గురుశరన్ ఎంపికయ్యారన్నారు. ఎంపికైన క్రీడాకారులను వైస్ చైర్మన్ అభినందించి ఒక్కొక్కరికి రూ.ఐదు వేలు నగదు బహుమతులు అందచేశారు. క్రీడాకారులంతా మంచి ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాండిచ్చేరి వెళ్లే క్రీడాకారుల వెంట టీమ్ మేనేజరుగా ఆదిత్య ఫిజికల్ డైరెక్టర్ సి.హెచ్. మురళీమోహన్ పాల్గొంటారని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాధ్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్ సి.హెచ్. మురళీమోహన్, జి. వెంకన్న, తదితరులు అభినందించారు.







