* రాష్ట్రంలో త్వరలో మరో మూడు మొబైల్ ఫోన్ కంపెనీలు
* రాష్ట్ర ఐ.టి శాఖా మంత్రి నారా లోకేష్
UPDATED 6th JANUARY 2018 SATURDAY 5:00 PM
పెద్దాపురం: రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఐ.టి శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో అపర్ణా గ్రూప్ నెలకొల్పిన విటిరో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2019 నాటికి రాష్ట్ర ఐ.టి రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మొబైల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయని, 2019 నాటికి మరో మూడు కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుచేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ కంపెనీ రాష్ట్రంలోని అనంతపురంకు తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తయారీరంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర జిడిపి పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం తక్కువగా ఉందన్నారు. దేశ జీడీపీలో తయారీరంగం వాటా సగటున 16 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇది ఎనిమిది శాతం మాత్రమేనన్నారు. గుజరాత్ రాష్ట్రంలో తయారీరంగంలో జిడిపి వాటా 32 శాతం వరకు ఉందని, అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అపర్ణా గ్రూప్ ప్రమోటర్స్ మాట్లాడుతూ తమ టైల్స్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని రూ.15వందల కోట్లతో విస్తరించనున్నామని, రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా టైల్స్ ఉత్పత్తి కోసం నూతనంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పెద్దాపురంలో నిర్మించిన ప్లాంట్ కోసం రూ.320 కోట్లు ఖర్చుచేశామని, నిర్మాణరంగంలో నాణ్యమైన విట్రిఫైడ్ టైల్స్ కు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అపర్ణా ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ ఎస్.ఎస్. రెడ్డి, డైరెక్టర్ ఎస్.అపర్ణారెడ్డి తెలిపారు.







