* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి
UPDATED 19th JULY 2020 SUNDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడంతో పాటు వీలైనంతమేర ఎక్కువ శాంపుల్స్ సేకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంజయ్ నగర్, ఏటిమొగ ప్రాంతాల్లో ఉన్న అర్బన్ మెడికల్ హెల్త్ సెంటర్లను కలెక్టర్ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో రోజుకు సుమారు ఏడు వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఆదివారం కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ ఆయా సెంటర్లలో కరోనా పరీక్షలు యధావిధిగా జరుగుతున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నా చాలా చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏ విధమైన పని లేకపోయినా బయట తిరగడం, చిన్న చిన్న ఫంక్షన్ లు నిర్వహించడం, యువకులు గుంపులుగా కూడి మద్యం సేవించడం, పేకాట ఆడటం వంటి సందర్భాలు మా దృష్టికి వచ్చాయని, ఇలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం అర్బన్ మెడికల్ హెల్త్ సెంటర్లు వద్ద నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల తీరు పరిశీలించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డాక్టర్ పి. ప్రశాంత్, అర్బన్ తహసీల్దార్ వై.హెచ్.ఎస్. సతీష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







