UPDATED 3rd JANUARY 2019 THURSDAY 6:00 PM
రాజానగరం: శారీరకశ్రమ, వ్యాయామం నిత్యజీవితంలో ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షక దళం డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. అనంతపురం నుంచి చేపట్టిన సైక్లోథాన్ 2019 గురువారం గైట్ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థల చైర్మన్, శాసన మండలిలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కెవివి సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అధ్యక్షతన జరిగిన సమావేశంలో డైరెక్టర్ జనరల్ ప్రతాప్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శారీరక సౌందర్యానికి రహస్యం వ్యాయామమేనని, ప్రతీరోజూ కొంత సమయాన్ని వ్యాయాయం కోసం కేటాయించాలని, దీనివల్ల ఆత్మస్థైర్యం పెంపొందుతుందని అన్నారు. యాంత్రీకరణ కారణంగా చాలామంది శారీరకంగా కష్టపడడం మానేశారని, దీనితో ప్రతీ ఇంట్లో డయాబెటిక్ రోగులు కనబడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు కొదవలేదని, కష్టించే తత్వం అలవరచుకోవడం ఎంతో అవసరమని, ప్రతిభ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయని అందుకు సింగర్ బేబీ ఉదాహరణని అన్నారు. శాసన మండలి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ చైతన్యరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, శారీరక ధారుడ్యాలపై అవగాహన కల్పించేందుకు డైరెక్టర్ జనరల్ ప్రతాప్ చేపట్టిన సైకిల్ ర్యాలీ మంచి సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ప్రతాప్ తో కలిసి చైతన్యరాజు కొంతసేపు సైకిల్ తొక్కారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజకిషోర్, చైతన్య విద్యాసంస్థల సిఇవో డాక్టర్ డిఎల్ఎన్ రాజు, జనరల్ మేనేజర్ ఎ. నరేష్ రాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, వల్లీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎస్ మూర్తి, ఓఎస్డి ఎన్. బాబ్జి, ఏపి ఎస్ఎఫ్ డిఎస్పీ డికెఎస్ రాజు, ఇనస్పెక్టర్లు పివిఎస్ఎన్ మల్లిఖార్జునరావు, కేశవరాము, రాము, గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు భాస్కరరెడ్డి, గోపాలరాజు, వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ప్రతాప్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజకిషోర్ లను కళాశాల యాజమాన్యం దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజకిషోర్ కళాశాల చైర్మన్ కెవివి సత్యనారాయణరాజుతో కలిసి మొక్కలు నాటారు.







