UPDATED 10th JUNE 2018 SUNDAY 10:00 PM
రాజానగరం: అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సిలికాన్ వ్యాలీమీట్ స్పింగ్ 2018 కార్యక్రమంలో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు పాల్గొని తిరిగి వచ్చారని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు) తెలిపారు. ఈ సందర్భంగా గైట్ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చైతన్యరాజు మాట్లాడుతూ గైట్ కళాశాలకు చెందిన మంతెన యశ్వంత్ బలరామరాజు, ఆలూరి నిషిత, అంబటిపూడి నాగవెంకట మంజునాథ కౌషిక్ విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్ ఫెలోస్ గా ఎంపికయ్యారని తెలిపారు. యుఐఎఫ్ కు వెళ్లిన వారిలో తమ కళాశాల విద్యార్దులే అత్యధికులు అని చెప్పారు. మూడవ బ్యాచ్ కు కూడా తమ కళాశాల నుంచి విద్యార్థులు త్వరలో యూఐఎఫ్ కు వెళ్ళనున్నారని తెలిపారు. తొమ్మిది దేశాల్లో 64 ఉన్నత విద్యా సంస్థలు నుంచి 258 మంది విద్యార్థులు యూనివర్శిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ గా ఎంపిక కాగా అందులో ముగ్గురు తమ కళాశాల విద్యార్థులు ఉన్నారని, ప్రపంచ విద్యా వ్యవస్థలో వీరు అంబాసిడర్లుగా వ్యవహరిస్తారన్నారు. ఈ విద్యార్థులు వారి సహచరులకు ఆవిష్కరణ, వ్యవస్థాపకత డిజైన్, ఆలోచన, సృజనాత్మకతలో పాలు పంచుకోవడానికి కొత్త అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తారన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం హస్సో ప్లాట్నెర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (డి.స్కూల్)చే యూనివర్శిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంతవరకు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులకు ఆరు వారాల ఆన్ లైన్ శిక్షణ, యుఐఎఫ్ సిలికాన్ వ్యాలీ మీట్ అప్ కి వెళ్ళడానికి అవసమైన ప్రోత్సాహం అందచేస్తుందన్నారు. నైపుణ్యాలు, విజ్ఞానం వృద్ధి చెంది ప్రపంచంలో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనడానికి యూఐఎఫ్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో చైతన్య విద్యా సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, అకడమిక్ డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీలావతి, డాక్టర్ ఎస్. మూర్తి, డిజిఎం ఎ. నరేష్ రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







