UPDATED 25th OCTOBER 2018 THURSDAY 6:00 PM
రాజానగరం: స్థానిక గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం-ఒత్తిడి అధిగమించడం అనే అంశంపై గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జి. రామానుజం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పీ, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ నామగిరి బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఏవిధంగా వ్యవహరించాలో శాస్త్రీయంగా వివరించారు. ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులు వాటిని అధిగమించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు. వక్తిత్వాన్ని పెంపొందించుకునే అంశంపై మాట్లాడుతూ ఏదైనా ఒక విషయం, ఒక సంఘటన పట్ల మనం చూసే పద్ధతి, దానిని అవగాహన చేసుకుని ఆపై ఆలోచించే విధానం తద్వారా నడవడికను సరిదిద్దుకునే పద్దతులను తెలిపారు. వీటి ద్వారా సత్ప్రవర్తన అలవరచుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జీని కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డాక్టర్ రామానుజం, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు.







