* పెద్దాపురం ఎన్టీఆర్ కోలనీలో ఘటన
* కేసు నమోదు చేసిన పోలీసులు
* నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ పలు సంఘాలు ఆందోళన
UPDATED 21st OCTOBER 2020 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ఒడిశా రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం వలస వచ్చిన "నాయక్" కులానికి చెందిన మహిళపై ఓ వైసీపీ నాయకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానిక ఎన్టీఆర్ కోలనీలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పెద్దాపురం ఎస్ఐ ఏ. బాలాజీ తెలిపిన వివరాలు ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన సుచిత్రా నాయక్ అనే మహిళ తన భర్త హేమంత్ నాయక్ తో కలిసి పెద్దాపురం- జగ్గంపేట రహదారిలో గల ఎన్టీఆర్ కోలనీలో సుమారు తొమ్మిది నెలల నుంచి నివాసం ఉంటూ పట్టణ శివారులో గల ఒక రొయ్యల పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. సుమారు 15 రోజులు క్రితం ఆమె భర్త ఊరు వెళ్లడంతో ఒంటరిగా తన ఇంట్లోనే ఉంటోంది. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రంగనాథం జీవరత్నం (జీవా) ఈనెల 19 తేదీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని తెలిపారు. ఇంతలో ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ విషయమై నిందితుడుపై ఐపీసీ 354 (A), 448 సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ ధర్నా
బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ ఐద్వాతో పాటు పలు సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించాయి. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని, పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో ఇక్కడకు వస్తే వారిపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం దారుణమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.







