UPDATED 11th JULY 2019 THURSDAY 8:00 PM
గండేపల్లి: జనాభా పెరుగుదలతో దేశాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల, తరుగుదలకు సంబంధించిన విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించి ప్రతీ సంవత్సరం జులై నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తోందని అన్నారు. ప్రపంచ ఆర్ధిక, సామాజిక రంగాల అభివృద్దికి జనాభా పెరుగుదల పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు చాలా అవసరమని, కానీ జనాభా పెరిగితే వనరులు తగ్గిపోతాయని అన్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో నీటికి విపరీతమైన కొరత ఏర్పడిందని, అలాగే ఎన్నో దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని అన్నారు. అధిక జనాభా కలిగిన దేశాలలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉందని, మరో పదేళ్లలో ఈ విషయంలో చైనాను మించుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఇదేకనుక జరిగితే భారత్ మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. జనాభా పెరుగుదల వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పిపిటి, డిబేట్లు, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ఎం.వి. హరనాథబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







