UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 5:30 PM
పెద్దాపురం: 18 సంవత్సరములు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఓటరుగా నమోదు కావాలని ఇది ప్రజాస్వామ్యంలో ప్రధాన బాధ్యత అని, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో లక్షా 84 వేల 932 మంది ఓటర్లు ఉన్నారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. సోమవారం విలేఖరులతో ఆర్డీవో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పురుషులు 91,976, మహిళలు 92,935, ఇతరులు 21 మంది ఓటర్లు ఉన్నారని, ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు 1-1-2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటుహక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటరుగా నమోదు కావడానికి ఫారం-6 ను పూర్తి చేసి ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో అందచేయవచ్చని, అలాగే ఆన్ లైన్ లో కూడ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమం 31-10-2018 నాటి వరకు కాలపరిమితి ఉందని కొత్త ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో నమోదు చేసిన వారి లిస్టును బూత్ లెవెల్ అధికారులకు అందచేయడం జరిగిందని, ఈ లిస్టును పరిశీలించుకుని లోటుపాట్లను మార్పు చేసుకోవచ్చని, నియోజకవర్గంలో 5245 ఓటరు ఐడీకార్డులు (ఎపిక్ కార్డులు) పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో గతంలో ఇంటింటికి సర్వే చేయడం జరిగిందని దీనికి సంబంధించి ఈ.పి రేషియో ప్రకారం సామర్లకోట, పెద్దాపురంలో తక్కువగా ఉన్నందున తిరిగి ఇంటింటికి ఓటర్లు సర్వే చేపట్టామని చెప్పారు. ఓటర్లను చైతన్యం చేయడానికి 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఓటరు నమోదుపై చైతన్యం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 4500 మంది విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. పోలింగు స్టేషన్లలో ఓటర్లు రూరల్ లో 1200 మంది, అర్బన్ లో 1400 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాలని, ఈ సంఖ్య కంటే ఎక్కువ ఉంటే వేరొక స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు నియోజకవర్గంలో 204 పోలింగు స్టేషన్లు కలిగి ఉన్నాయని, మరో 7 పోలింగు స్టేషన్లు కొత్తగా ఏర్పాటుచేశామని దీనితో 21 పోలింగు స్టేషన్లు కలిగి ఉన్నాయని చెప్పారు. 37 పోలింగ్ స్టేషన్లు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నందున వాటిని మార్పు చేయడం జరిగిందని చెప్పారు. వికలాంగులు ఉన్న ఏరియాలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే పోలింగు స్టేషన్లలో మరుగుదొడ్లు, కరెంటు, త్రాగునీటి ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్ కు రెండు కిలోమీటర్లు దూరాన్ని తనిఖీ చేసి నివేదికలు తయారుచేశామని తెలిపారు. నియోజకవర్గంలో తహసీల్దార్లు, కమీషనర్లు, అసిస్టెంట్ రిటర్నింగు అధికారులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. భవిష్యత్ లో ఓటర్లు నమోదుకు సిద్ధపడుతున్న విద్యార్థులను చైతన్యపర్చడానికి ఎన్నికల కమీషన్ పుస్తకాలను పాఠశాలలకు, కళాశాలలకు పంపిణీ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఏడు ప్రధాన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటుచేసి ఓటర్లు నమోదుకు సహకరించాలని, అలాగే ప్రతీ పోలింగ్ స్టేషన్ కు రాజకీయ పార్టీ తరుపున ఏజెంట్లను ఏర్పాటు చేయమని కోరినట్లు చెప్పారు. 10 మంది బిఎల్.వోలకు ఒక సూపర్ వైజరును కూడ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీ గురువారం, శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.







