* నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వైద్య సేవలు
* జిల్లాలో 16 లక్షల 11 వేల 530 ఆరోగ్యశ్రీ కార్డులు
UPDATED 10th NOVEMBER 2020 TUESDAY 6:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లాలో 182 డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2,434 చికిత్సలు అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. స్థానిక రామారావుపేటలో గల సంజీవిని ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి. రాధాకృష్ణ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఇంత వరకు మొత్తం రూ.78.74 కోట్లు చెల్లించడం జరిగిందని, అలాగే జిల్లాలో 16 లక్షల 11 వేల 530 ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 2019 డిసెంబర్ 1 నుంచి ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స అనంతరం జీవన భృతి ద్వారా రోగి కోలుకునే సమయంలో రోజుకు కనిష్టంగా రూ.225 చొప్పున, గరిష్టంగా నెలకు రూ ఐదు వేలు డిశ్చార్జ్ అయిన 48 గంటల లోపు చికిత్స పొందిన వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఆసరా పథకం ప్రారంభం నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 29 వేల 506 మంది లబ్దిదారులకు మేలు జరిగిందని, ఈ పథకం జిల్లాలో సక్రమంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు.
నాకెంతో మేలు జరుగుతోంది
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందుతున్న కాకినాడ గ్రామీణ మండలం, వాకలపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సంగడి గోవిందురాజు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రితో మాట్లాడారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు పడిపోవడంతో దెబ్బ తగిలిందన్నారు. చికిత్స నిమిత్తం ఆపరేషన్ కి సంబంధించి తమ వాలంటర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సమాచారం చెప్పడంతో సంజీవని ఆసుపత్రి ఆరోగ్య మిత్రాను కలుసుకోవడం జరిగిందని తెలిపారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక తనకు ఎంతో లబ్ధి చేకూరిందని, వికలాంగుల పింఛన్ తో పాటు తన పాపకు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు అందాయని అన్నారు. తాను ఇంటి వద్దే టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, దీనికి సంబంధించి వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంజీవని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సూర్యప్రకాశరావు, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ డి. రాంబాబు, ఆరోగ్య మిత్రాలు పాల్గొన్నారు.







