UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్ రాయితీలను అమలు చేయకుండా సామర్లకోట పట్టణ, మండల విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల వారు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ సోమవారం తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం అప్పలకొండ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 100 యూనిట్లు వరకు విద్యుత్తును వినియోగించుకునేందుకు ఉచిత రాయితీలను అమలు చేయాల్సిఉన్నప్పటికీ సకాలంలో ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రాని కారణంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం అన్యాయమని అన్నారు. ఈ విషయంపై జిల్లాస్థాయి, సిఎండి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం సభ్యులు జుత్తుక అప్పారావు, కుంచే నానిబాబు, జొన్నాడ వెంకటరమణ, అళక్కి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.







