◆ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా
UPDATED 13th APRIL 2022 WEDNESDAY 8:00 PM
District Collector Dr. Kruthika Shukla : కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఆసుపత్రి మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జీజీహెచ్ వైద్యులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఉదయం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రేడియాలజీ విభాగంలోని అల్ట్రాసౌండ్, స్కానింగ్ వార్డులను కలెక్టర్ పరిశీలించి వైద్య సేవలు అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆర్థోపెడిక్ వార్డును పరిశీలించి అవుట్‌పేషెంట్ విధానం అమలు, డ్యూటీ డాక్టర్ల అందిస్తున్న సేవలపై వైద్యులతో చర్చించారు. అనంతరం మెడికల్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్యసేవలు, భోజన సదుపాయం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు భరోసా కల్పించేలా సేవలు అందించాలన్నారు.
ముఖ్యంగా ఆసుపత్రిలోని వార్డులు, మరుగుదొడ్లు ఎప్పడూ పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకటబుద్ధ, ఆర్ఎంవో డాక్టర్ అనిత, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.







