వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

UPDATED 7th MAY 2019 TUESDAY 10:00 PM

విశాఖపట్నం: సింహగిరిపై వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగింది. చందనచర్చితుడైన శ్వేతవరాహమూర్తి నిజరూపాన్ని కనులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కె. భాస్కర్ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్, సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. వేకువ జామున ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి స్వామిని మేల్కొలిపారు. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాలాచార్యులు, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఋత్విక్కులు, అర్చకులు వెండి బొరిగెలతో స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వామికి కిరీట సమర్పణ చేశారు. స్వామి సాక్షాత్కారం కాగానే దృష్టిదోష నివారణకు మంగళ నీరాజనం సమర్పించారు. అనంతరం ఆరాధనం, పంచకలశ ఆవాహనం చేశాక పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి హృదయం, శిరస్సుపై చందనాన్ని అలంకరించిన అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులకు స్వామివారి తొలిదర్శనం కల్పించారు. అనంతరం సామాన్య భక్తులను అనుమతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ జేఈవో శ్రీనివాసులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు, ఎంపీ అవంతి శ్రీనివాస్, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us